నేటి మాట

బ్రతుకు ఒక పోరాటం, దాని కోసం ఆరాటం పనికి రాదు. --కాళోజి-!

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆవిర్భవం

ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆవిర్భవించింది. దీనికి సంబంధించి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు చట్టం-1971ని తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది. ఇకనుంచి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా వేరుగా పరీక్షలు నిర్వహించుకోవడానికి మార్గం సుగమమైంది. ఇంటర్బోర్డు విభజన ఫైలుపై శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. సోమవారం ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శి వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇంటర్బోర్డు విభజనపై ఉన్నతవిద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి గురువారమే అధికారులతో సమీక్ష నిర్వహించి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 

మన రాష్ట్రం - మన పరీక్షలు


ప్రత్యేకంగా ఇంటర్మీడియట్బోర్డు ఆవిర్భవించడంతో మన రాష్ట్రంలో మనమే పరీక్షలు నిర్వహించుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లలో తెలంగాణ బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాల తయారీ, వాటికోసం నిపుణుల ఎంపిక, జవాబుపత్రాల ముద్రణ వంటి పనులు వేగం పుంజుకున్నాయి. తెలంగాణ బోర్డుకు సంబంధించి ప్రత్యేకంగా పరిపాలన విభాగాన్ని ఏర్పాటుచేశారు. నిధులు, విధుల వాటాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. 

అందులోభాగంగానే బోర్డు విభజనకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్, మార్చి-ఏప్రిల్లలో థియరీ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుపై సీఎం, విద్యాశాఖమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, విద్యావేత్త చుక్కా రామయ్య, తెలంగాణ లెక్చరర్ల సంఘం, విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్, టీఆర్ఎస్ విద్యార్థిసంఘం రాష్ట్ర నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మేధావులు హర్షం వ్యక్తంచేశారు.


ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించండి:ఏపీ ప్రభుత్వం


ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని, ప్రత్యేకంగా నిర్వహించడం వల్ల ఎంసెట్ వెయిటేజీపై తీవ్ర ప్రభావం పడుతుందంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనున్నట్లు తెలిసింది. అయితే పరీక్షలను ప్రత్యేకంగా నిర్వహించడానికే తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కట్టుబడి ఉన్నారు. జాతీయ పరీక్షలు, ఎంసెట్ వెయిటేజీలాంటి కుంటి సాకులతో ఉమ్మడి పరీక్షలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని.. దీనిని తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా తిప్పికొడుతుందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి అన్నారు.

0 comments:

Post a Comment

Viewers

Popular Posts

Latest Posts

Education

Health

Hyderabad

Business

Sports