క్యాన్సర్.. ఈ పదం విన్నట్టే ఉంటుంది. అంతా తెలిసినట్టే ఉంటుంది. కాని ఏమీ తెలియదు. క్యాన్సర్ అనే జబ్బు వచ్చింది అని మాత్రం అర్థం అవుతుంది. మరి క్యాన్సర్ అంటే ఏంటి? ఏమవుతుంది? ఎవరికి చూపించుకోవాలి? ఏం చేయాలి? అన్న విషయాలు మాత్రం గందరగోళం కలిగిస్తాయి. ఇప్పుడు క్యాన్సర్ను జయించడం అసాధ్యం కానేకాదు. కాని 30 ఏళ్ల క్రితం పరిస్థితుల్లో ఇప్పుడు మనం లేము క్యాన్సర్ స్పెషలిస్టులు, ఆసుపత్రుల సంఖ్యే కాదు.. ఆంకాలజీలో ఆయా అవయవాలను బట్టి ప్రత్యేక విభాగాలు కూడా ఇప్పుడు వచ్చాయి. సాధారణంగా రేడియేషన్ ఆంకాలజిస్టు రేడియోథెరపీ చేస్తాడు.
సర్జికల్ ఆంకాలజిస్టు సర్జరీ చేస్తాడు. మెడికల్ ఆంకాలజిస్టు కీమోథెరపీ ఇస్తాడు. మనదగ్గర సాధారణంగా అందరూ అన్ని చికిత్సలూ చేస్తున్నారు. ఇది అంత మంచిది కాదు. క్యాన్సర్ రకం, దశను బట్టి ఆయా చికిత్సలను, ఆయా స్పెషలిస్టులను ఎంచుకోవాలి. ఏ రొమ్ము క్యాన్సరో, సర్వైకల్ క్యాన్సరో అయినప్పుడు గడ్డ అక్కడ అయింది కదా అని గైనకాలజిస్టు దగ్గర చికిత్స తీసుకుందాం అనుకుంటారు. కాని ముందు క్యాన్సర్ స్పెషలిస్టును కలవాలి.
డాక్టర్ని ఏమి అడగాలి?
డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఏమీ దాచకుండా చెప్పాలంటారు. చెప్పడమే కాదు.. డాక్టర్ దగ్గరి నుంచి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యమే. నిస్సంకోచంగా ఎటువంటి అనుమానం ఉన్నా అడగాలి. శరీరంలో సహజంగా జరిగే కణాల పెరుగుదల అదుపు తప్పి, అసహజ పెరుగుదల రావడం వల్ల ఏర్పడే కణాల సముదాయమే క్యాన్సర్ గడ్డ. ఎక్కడ ఈ గడ్డ ఏర్పడింది...? దీని వెనుక కారణం ఏమిటి..? ఇది క్యాన్సర్ గడ్డే అని దేన్ని బట్టి నిర్ధారణకు వచ్చారు...? చికిత్సా పద్ధతులు ఏమున్నాయి..? వాటివల్ల ఎటువంటి ప్రయోజనాలు, ఏ మేరకు ఉన్నాయి..? తదితర విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
ఏ రకమైన క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. కొన్ని క్యాన్సర్లకు ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఎందుకంటే వాటికి చికిత్స అందించినా, అందించకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. క్రానిక్ లింఫోసైటిక్ ల్యుకేమియా, లో గ్రేడ్ లింఫోమాస్, ఫాలిక్యులర్ లింఫోమా లాంటి క్యాన్సర్లు ఉన్నప్పుడు పేషెంటుకు ఎటువంటి ఇబ్బందులు కలగకపోతే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అవి ఉన్నా 7 నుంచి 10 సంవత్సరాలు హాయిగా ఉండగలుగుతారు. హిమోగ్లోబిన్ పడిపోవడమో, ప్లేట్లెట్లు తగ్గిపోవడమో, జ్వరం రావడమో లాంటి సమస్యలుంటే తప్ప వీటికి చికిత్స అవసరం లేదు. వీటి గురించి చెప్పాల్సిన బాధ్యత ఆంకాలజిస్టుల పైన ఉంది.
ఏ దశలో ఉంది?
పేషెంటును పరీక్షించిన వెంటనే ఆ క్యాన్సర్ ఏ దశలో ఉందన్నది తెలుసుకోవచ్చు. బయాప్సీ చేస్తే క్యాన్సర్ ఉందోలేదో మాత్రమే తెలుస్తుంది. కాని క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి ప్రత్యేక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ వేరే అవయవానికి అంటే ఏ ఊపిరితిత్తులకో, కాలేయానికో, ఎముకకో ఇలా పాకిపోతే నాలుగోదశలోకి వచ్చేసినట్టే. అలా కాకుండా ఒకే చోట తొలిదశలో ఉంటే మొదటి దశ. కేవలం లింఫ్ నోడ్స్ వరకు వెళ్తే రెండు లేదా మూడో దశ. ఇలా ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి చెస్ట్ సీటీ, పొట్ట సీటీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, బోన్ స్కాన్, పెట్ సీటీ లాంటి పరీక్షలు అవసరమవుతాయి.
పూర్తిగా తగ్గే అవకాశం ఏ మేరకు ఉంది?
ఏ జబ్బును కూడా వంద శాతం నయం చేయడం సాధ్యం కాదు. జబ్బు నయం కావడం అంటే తిరిగి రాకుండా ఉండడం. కాబట్టి అయిదేళ్ల దాకా క్యాన్సర్ నయమైందని చెప్పలేం. ట్రీట్మెంట్ పూర్తయిన తరువాత అయిదేళ్ల వరకు క్యాన్సర్ రాకపోతే మళ్లీ వచ్చే అవకాశం చాలా అరుదు. ట్రీట్మెంట్ అయ్యాక మూడు నెలల తరువాత తప్పనిసరిగా డాక్టర్ సూచన మేరకు ఫాలోఅప్కి రావాలి. ఆ తరువాత అవసరమైన మందులు ఇచ్చినా మూడేళ్ల వరకు కలుస్తూనే ఉండాలి. మూడేళ్ల తరువాత కూడా క్యాన్సర్ రాకపోతే హమ్మయ్య అనుకోవడానికి వీలులేదు. మరోరెండేళ్లు డాక్టర్తో ఫాలోఅప్లో తప్పనిసరిగా ఉండాలి. ఆ తరువాత కూడా అంటే చికిత్స తీసుకున్న అయిదేళ్ల తరువాత కూడా క్యాన్సర్ మళ్లీ కనిపించకపోతే ఇక రాకపోవచ్చు.
సైడ్ ఎఫెక్టులు ఏంటి?
సాధారణంగా ఏ చిన్న మందు వేసుకున్నా దానికి సంబంధించిన ఏవో చిన్న చిన్న సైడ్ ఎఫెక్టులు ఉంటూనే ఉంటాయి. క్యాన్సర్ లాంటి జబ్బు ఉన్నప్పుడు దాని మందులకు ఈ దుష్ప్రభావాలు మరికొంత తీవ్రంగా ఉండడం సహజం. అందువల్ల క్యాన్సర్ చికిత్స వల్ల ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ అయిన తరువాత ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉందన్నది తప్పనిసరిగా తెలుసుకోవాలి. వీటిలో దీర్ఘకాలికంగా బాధించేవి ఏవి? తాత్కాలికంగా బాధించేవి ఏవి? వేటి రిస్కు ఎంత అన్నది అవగాహన ఉండాలి. అదేవిధంగా సర్జరీ వల్ల కలిగే ఇబ్బందులేంటన్నది కూడా తెలుసుకోవాలి.
ఏ రకమైన వైద్యం అవసరం?
కొన్ని రకాల క్యాన్సర్లకు సర్జరీ తప్పనిసరి అవుతుంది. కొన్నింటికి కీమోథెరపీ లేదా రేడియోథెరపీ సరిపోతుంది. సాధారణంగా మొదటి దశలో ఉన్న క్యాన్సర్లకే సర్జరీ చేస్తాం. క్యాన్సర్ రకాన్ని బట్టి చికిత్సా పద్ధతులు అవలంబించాల్సి ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ 1, 2 , 3 దశల్లో ఉంటే సర్జరీ చేయవచ్చు. వేరే భాగాలకు పాకితే సర్జరీ చేసినా ఉపయోగం ఉండదు. అందుకే నాలుగోదశలో ఉన్న క్యాన్సర్లలో 99 శాతం సర్జరీ చేయం. సర్వికల్ క్యాన్సర్ మొదటి దశలో అయితే సర్జరీ చేయాలి. రెండు లేదా మూడో దశలోకి చేరితే రేడియేషన్ లేదా కీమోథెరపీ ఇస్తారు. లింఫోమాస్ ఉంటే సర్జరీ చేయం. ఇలాంటప్పుడు కీమో, రేడియేషన్లే కీలకమైనవి. కాబట్టి దేనికి ఏ చికిత్సా పద్ధతి బెటర్ అన్నది తెలుసుకోవాలి. ట్రీట్మెంట్ ఆప్షన్లేమిటన్నది ఆంకాలజిస్టును అడిగి తెలుసుకోవడం అవసరం. కొన్నిసార్లు క్యాన్సర్కి సర్జరీ చేసిన తరువాత కూడా ఇతర చికిత్సలు అందివ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు రెండోదశలో ఉన్న కోలన్ క్యాన్సర్కు ఆపరేషన్ చేస్తే, ఆ తరువాత రిపోర్టును బట్టి కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయాల గురించి క్యాన్సర్ వచ్చిన వెంటనే వివరంగా తెలుసుకోవచ్చు.
ఏ మార్పులు అవసరం?
-ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. నాలుక రుచి కోల్పోతుంది కాబట్టి ఫాస్ట్ఫుడ్స్ వైపు మనసు మళ్లుతుంది. కాని ఇంటి తిండికే పరిమితం అయితే మంచిది.
-ఆకలి తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు కొంచెం కొంచెం తినాలి.
-బయట ఎక్కువగా తిరగొద్దు. క్యాన్సర్ పేషెంట్లలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్లు వచ్చే
అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
-నిలవ ఆహారం జోలికి వెళ్లవద్దు. పచ్చళ్లు, ప్యాక్డ్ ఫుడ్ వద్దు.
-తేలిగ్గా అరిగే ఆహారం మంచిది.
-పండ్లు ఎక్కువగా తినాలి. ద్రాక్షల్లాంటి వాటి కన్నా కోసుకుని తినగలిగేవి బెటర్.
-పచ్చి కూరగాయలు తీసుకోవద్దు. సరిగ్గా శుభ్రపరచకపోతే వీటి ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
-అన్ని రకాల తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు.
0 comments:
Post a Comment