భారతీయ జనతాపార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మహరాష్ట్ర టైపు ప్లాన్ ను అమలు చేయాలని చూస్తోందని ఆ పార్టీ అంతర్గత వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బాబుకు ఝలక్ ఇచ్చి, పవన్ ను ముందుకు పెట్టి, వివిధ పార్టీల నుంచి నాయకులను సమీకరించి, అధికారం దిశగా నడవాలన్నది మోడీ ప్రణాళికగా చెప్పుకుంటున్నారు. పవన్ కు ఇప్పటికే ఆ దిశగా దిశానిర్దేశం చేసినట్లు ఆయన అభిమానులు అనుకుంటున్నారు. మోడీ వచ్చి వేయి కోట్లు ప్రకటించిన తరువాతే పవన్ కదిలి వెళ్లారు. వెళ్తూనే మోడీనీ ప్రశంసలతో ముంచెత్తారు. విశాఖ వెళ్లిన తరువాత సీన్ కూడా అలాగే వుంది. భాజపా మంత్రి కామినేని శ్రీనివాస్ స్వయంగా పవన్ పర్యటన వ్యవహారాలు చూసినట్లు వినికిడి.
పవన్ ను అభిమానించే ఆయన సామాజిక వర్గానికి చెందిన ఘంటా, నారాయణ సంగతి చెప్పనక్కరలేదు. భాజపా శ్రేణులు కనిపిస్తున్నాయి తప్ప, జనసత్తా మేము..అనేవారు కనిపించలేదు. అంటే ఇక పవన్ పూర్తిగా భాజపా గ్రిప్ లోకి వెళ్లినట్లే అనకోవాలి. పైగా పవన్ పక్కా రాజకీయ వేత్తగానే వ్యవహరిస్తున్నారు. కాటన్ చొక్కాలు ధరించి వెళ్లడం, పనిలో పని బాబును, మోడీగా ప్రశంసించడం చేస్తున్నారు. పవన్ కూడా విమర్శలు తగవని అంటూనే ఎదుటి వారు విమర్శించేలా మాట్లాడుతున్నారు. అనుభవం వున్నవారు ముఖ్యమంత్రి అయినందువల్ల మంచే జరిగిందన్నట్లుగా అంటున్నారు. ఇది సహజంగానే జగన్ అభిమానులకు ఇబ్బందిగా వుంటుంది.
వీటన్నింటిని పరిశీలించినవారు చిరంజీవికి రాజకీయాలు అబ్బలేదు కానీ, పవన్ కు బాగానే అబ్బాయని కామెంట్ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లినా చిరంజీవి గ్లామర్ గా వుండాలనుకుంటారు. కానీ పవన్ డీగ్లామర్ గా తయారై వెళ్తారు. సో అన్ని విధాలా పవన్ వచ్చే ఎన్నికల నాటికి రెడీ అవుతున్నట్లే కనిపిస్తోంది.
భాజపా కూడా మహరాష్ట్ర ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి, సీట్ల తకరారు తెచ్చుకుని బాబుకు టాటా చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. భాజపాలో వున్న ఎవరికీ ఇలాంటి పరిణామం సంభవించినా ఆనందమే కానీ చింత లేదు. వుంటే గింటే ఒక్క వెంకయ్యనాయుడు గారికే వుండాలి. ఎందుకంటే తెలుగుదేశం, భాజపా పెళ్లికి పురోహితుడాయన. అది పెటాకులైతే ఆయన సహించలేరు. ఆయన తన సర్వస్వం ఒడ్డి అయినా దాన్ని నిలబెట్టాలని చూస్తారు. కానీ మోడీ తలుచుకుంటే మాత్రం తల ఒంచక తప్పదు.
0 comments:
Post a Comment