నేటి మాట

బ్రతుకు ఒక పోరాటం, దాని కోసం ఆరాటం పనికి రాదు. --కాళోజి-!


రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణాలో ఉత్పత్తి కేంద్రాలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడే ఎక్కువ విద్యుత్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. చరిత్రలో ఎప్పుడు, ప్రభుత్వాలు ఇవ్వనంత ఎక్కువ కరెంట్ తెలంగాణాలో సరఫరా చేస్తున్నామని హరీశ్రావు లెక్కలతో సహా మీడియాకు వివరించారు. విద్యుత్ సరఫరాపై ఎప్పుడు, ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన టీడీపీ, కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు. గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


ఇవీ లెక్కలు..: రాష్ట్రంలో ప్రతి రోజు 140 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నాం. 9 ఏళ్ల చంద్రబాబు ప్రభుత్వం, 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎప్పుడన్నా ఇంతకంటే ఎక్కువ కరెంట్ ఇచ్చారా? అని హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. గత సంవత్సరం ఇదే సీజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 113 మిలియన్ యూనిట్లు మాత్రమే తెలంగాణాకు సరఫరా చేశారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కేవలం 117 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేస్తున్నదని.. అక్కడ రోజు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉందని వివరించారు. అక్టోబరు 1 నుంచి 15 వరకు తెలంగాణాలో 2107 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తే ఏపీలో 1994 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశారు. తెలంగాణాలో మేమిచ్చే కరెంట్ కన్నా ఆంధ్రాలో బాబు ఇస్తున్న కరెంట్ తక్కువేనన్నారు.

రోజుకు రూ.15 కోట్ల విద్యుత్ కొంటున్నాం..: తెలంగాణాలో విద్యుత్ ప్లాంట్లు లేవు.. ఏపీ సర్కారు కావాలని విద్యుత్ సరఫరా నిలిపివేసింది , హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో లేదు.. గ్యాస్ విద్యుత్ జీరో.. తుఫాను వల్ల 800 మెగావాట్ల విద్యుత్ రాలేదు .. అయినా అన్ని అవాంతరాలు ఎదుర్కొని రికార్డు స్థాయిలో ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తున్నది అని స్పష్టం చేశారు. రైతులు, ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి రోజు రూ.15కోట్లు విద్యుత్ కొనుగోలుకు వెచ్చిస్తున్నామని తెలిపారు.

చంద్రబాబునే లెక్కలు అడగండి...:రోజుకు రూ.15 కోట్లు కరెంట్కు కొనుగోలుకు ఖర్చు చేస్తున్నాం. ఇది మేం చెబుతున్న గుడ్డిలెక్క కాదు. కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా లెక్క ఉంటుంది. చంద్రబాబు దగ్గర కూడా ఉంటాయి. అవసరమైతే టీడీపీ నేతలు అడిగి తెలుసుకోవాలి అని మంత్రి హరీశ్రావు టీడీపీ నేతలకు సూచించారు. రాజకీయాల కోసం టీడీపీ నాయకులు డ్రామాలాడుతున్నరు. పచ్చపార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు ఛాంబర్ ముందు ధర్నా చేస్తే కరెంటైనా వస్తుందన్నారు.

పచ్చపార్టీ ఎమ్మెల్యేలారా? లోయర్ సీలేరులో 400 మిలియన్ యూనిట్ల విద్యుత్లో తెలంగాణాకు 54 శాతం వాటా విద్యుత్ రావాల్సింది వాస్తవమా..కాదా..? కృష్టపట్నంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నా తెలంగాణకు కరెంట్ ఇవ్వాల్సి వస్తుందని ప్లాంటు ప్రారంభోత్సవాన్ని చంద్రబాబు వాయిదా వేసింది వాస్తవమా..కాదా..? అనంతపూర్, కర్నూల్ జిల్లాల్లో పవన, సోలార్ ఇతర సాంప్రదాయేతర పద్ధతిలో ఉత్పత్తి అవుతున్న 200 మెగావాట్లలో తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు పీపీఎలున్నా ఒక్క మెగావాటు కరెంట్ ఇవ్వకుండా చంద్రబాబు ఎగ్గొడుతున్నది వాస్తవమా, కాదా..? తేల్చి చెప్పాలని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. మోసం చేసింది చంద్రబాబు, కరెంట్ ఎగ్గొట్టింది చంద్రబాబు, తెలంగాణాకు కరెంట్ రాకుండా అడ్డుపడుతున్నది బాబేనన్నారు. మేం చెప్పిందాట్లో తప్పుంటే నిజమేమిటో టీడీపీ నేతలు చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

0 comments:

Post a Comment

Viewers

Popular Posts

Latest Posts

Education

Health

Hyderabad

Business

Sports