ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదాలో వున్నా, ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు ఔట్ అయిపోయారు.. ఆ ఎంపీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పంచన చేరారు. పార్టీలో చేరేందుకు మాత్రం ‘అనర్హత వేటు’ భయం వారిని వెంటాడుతోంది. ఇక, తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయమే. ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ వుండగా.. అందులో ఓ ఎమ్మెల్యే ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిపోయారు. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది.
అయితే, మొదటినుంచీ తెలంగాణ రాష్ట్ర సమితికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ సన్నిహిత సంబంధాలున్నాయి. ‘తెలంగాణలో మేము.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..’ అని గత ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి బాహాటంగానే చెప్పింది. అఫ్కోర్స్.. ఓదార్పు యాత్ర విషయంలో మాత్రం జగన్‌ని టీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందనుకోండి.. అది వేరే విషయం.
ఖమ్మం జిల్లా నుంచే వైఎస్సార్సీపీకి ప్రజా ప్రతినిథులున్నారు. తెలంగాణలోని మిగతా చోట్ల ఆ పార్టీకి ప్రాతినిథ్యమే లేని పరిస్థితి. తెలంగాణ మొత్తమ్మీద పుంజుకోవాలనే ఆలోచనతో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ దిశగా పార్టీకి చెందిన తెలంగాణ జిల్లాల నేతలతో మంతనాలు షురూ చేసింది. తెలంగాణకి ఇన్ఛార్జ్గా పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేరుని ప్రకటిస్తూనే, తన సోదరి షర్మిలకీ తెలంగాణ వైఎస్సార్సీపీ పగ్గాలు అప్పగించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
తెలంగాణ ప్రాంత నేతలతో సమావేశమైన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ ప్రజలకు మేలు కలిగేలా టీఆర్‌ఎస్ పాలన వుంటే ఆ పార్టీకి బేషరత్తు మద్దతిచ్చేస్తామని ప్రకటించారు. తేడా వస్తే మాత్రం, ప్రజల తరఫున రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని అంటున్నారు పొంగులేటి. అయితే ఇప్పటిదాకా తెలంగాణలో వైసీపీ ఉద్యమాలు చేసిన సందర్భాలే లేవు. రైతాంగం కరెంటు లేక, రోడ్డెక్కి నినదిస్తోంటే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ హడావిడి చేస్తున్నాయే తప్ప, వైసీపీ అసలు సోదిలోకే లేని పరిస్థితి.
మరి, పొంగులేటి బేషరతు మద్దతు.. అని తొందరపడి ఎందుకు ప్రకటించేసి వుంటారు.? ఈ ప్రశ్నకు సమాధానం సింపుల్. తెలంగాణలో ఎటూ టీఆర్ఎస్, ఇతర పార్టీకి చెందిన నేతల్ని తమలో కలిపేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్కి మిత్ర పక్షమైపోతే.. వున్న ప్రజా ప్రతినిథుల్ని కాపాడుకోవడంతోపాటు, తెలంగాణలో బలపడేందుకు ఆస్కారమవుతుందన్నది ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనగా కన్పిస్తోంది. జగన్ ఆలోచనలే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నోట ఇంకోలా వస్తున్నాయనుకోవాలేమో.!
0 comments:
Post a Comment