ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ మారలేదా అంటూ తెలంగాణ శాసనమండలి సభ్యుడు , ప్రముఖ విద్యావేత్త ఫ్రొఫెసర్ నాగేశ్వర్ ఒక వ్యాసం రాశారు.ఆయన తన ఇండియా కరెంట్ ఎఫైర్స్ వెబ్ సైట్ లోదీనిని ప్రచురించారు.దీని పూర్తి పాఠం ఇలా ఉంది.పాత మెండ్ సెట్ లోకే చంద్రబాబు వెళుతున్నారా!
విశాఖలో మకాం వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాను సమాయపనులను పర్యవేక్షిస్తున్నారు. అదికారులను పురమాయిస్తున్నారు. అనధికారులను సైతం కదిలిస్తున్నారు. కానీ చంద్రబాబు విలేకరుల సమావేశం చూస్తే ఆయన పదేపదే ఒక విషయం చెప్పడం గమనిస్తాం. తాను మాత్రం విరామం ఎరగకుండా పనిచేస్తున్నాడు కానీ ప్రభుత్వ అధికారులూ, ఉద్యోగులు మాత్రం సరిగా పనిచేయడం లేదు. ఇదే మాట చంద్రబాబు పదేపదే చెపుతున్నారు.
చంద్రబాబు వాదన వింతగా కనిపిస్తుంది. ఒకవైపు తన ప్రభుత్వం సహాయ చర్యలను సమర్ధ వంతంగా నిర్వహిస్తోంది అని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ సిబ్బంది సరిగా పనిచేయడంలేదు. అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇట్లాగా పనిచేస్తే ప్రజలు రాళ్ళుపట్టుకుని కొడతారు ’’ అని ఉద్యోగులను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు రాళ్ళతో కొట్టే స్థాయిలో ఉద్యోగులు పనిచేస్తుంటే ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసినట్లు ఎలా అవుతుంది? ప్రభుత్వ యంత్రాంగం పనిచేయకుండా ఒక్క ముఖ్యమంత్రే ఉరుకులు పరుగులు తీసినంతమాత్రాన పనిజరుగుతుందా?
రాజకీయ నాయకత్వం, పాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాల్సింది పోయి, అడుగడుగునా ఉద్యోగులు అసమర్ధులు చేతకాని వారు అంటూ తాను మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నా వాతావరణాన్ని చంద్రబాబు కల్పించదలచుకున్నారు. కానీ సిబ్బంది పనిచేస్తేనే ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుంది. సిబ్బంది పనిచేయనప్పుడు వారికి ముఖ్యమంత్రి చివాట్లు పెట్టినా కూడా ప్రజలు ప్రభుత్వాన్నే తప్పుబడతారు.
పని జరిగితే తనగొప్పతనం,పనిజరగకపోతే సిబ్బంది చేతకాని తనం ఇది చంద్రబాబు వైనం. ఉద్యోగులలో వేగాన్ని పెంచడానికి ఎప్పుడో ఒకసారి అంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ పదేపదే చంద్రబాబు సిబ్బంది పనిచేయడం లేదంటున్నారు. ప్రభుత్వం మాత్రం బాగా పనిచేస్తోంది అంటున్నారు. ఆఖరికి ఉద్యోగులు సమయానికి రాకపోతే పోలీసులను పంపించి వారిని తీసుకొస్తామంటున్నారు. కానీ ఇంత చేతకానివారిగా చంద్రబాబు పాలనలో ఎందుకు తయారయ్యారు. పోలీసులను పంపించి అరెస్టు చేసి అధికారులను తీసుకురావచ్చేమో కానీ వారిని పనిచేయిండం పోలీసులు తరం అవుతుందా? ఒక వేళ పోలీసులే సరిగా పనిచేయకపోతే ? చంద్రబాబు మోడీ సాయంతో మిలటరీనీ రప్పించి పోలీసులను పిలిపిస్తారా?
చంద్రబాబు పనికి మించిన పబ్లిసిటీకోసం తపన పడుతున్నారు. టివి.కెమెరాలను ముందుపెట్టుకుని ప్రధానితో ఫోన్లో మాట్లాడుతున్నారు. మీడియా ముందు సిబ్బందిపై కస్సుబుస్సు మంటున్నారు. ఇదంతా తన ఇమేజ్ ను పెంచుతుందని బహుశా చంద్రబాబు లెక్కులు వేసుకుంటున్నారు. కానీ దశాబ్దం క్రిందటి అనుభవం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. సరిగ్గా ఇదే పద్దతిలో ఆనాడు చంద్రబాబు పనిచేసారు. తన యంత్రాంగాన్ని తానే ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. చివరకు అదే ఆయనకు ప్రభుత్వ వ్యతిరేఖతను తెచ్చిపెట్టిది. ఉద్యోగులలో స్పూర్తి నింపే ముఖ్యమంత్రి కావాలి కేవలం చీవాట్లు పెట్టే ముఖ్యమంత్రి అయితే సరిపోదు అని ప్రజలు తీర్పు చెప్పారు.
చంద్రబాబు అధికారులను చీవాట్లు పెట్టడాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి పనిచేయని అధికారిని గుర్తించి హెచ్చరించడమో లేదా పనిచేయని పదిమందిపై గుర్తించి చర్యలు తీసుకోవడమో చేయడం లేదు. జనరల్ గా ఎవరూ పనిచేయడం లేదంటూ ఉపన్యాసాలిస్తున్నారు.
48 గంటలలో విద్యుత్తును పునరుద్ధరించాం అంటున్నారు చంద్రబాబు అదే సమయంలో విద్యుత్ సిబ్బంది పనిచేయలేదంటున్నారు. నీటి సరఫరాను సమర్ధవంతంగా పునరుద్ధరించాం మున్సిఫల్ సిబ్బంది పనిచేయడం లేదు. టెలికాం సేవలు అతి తక్కువ సమయంలోనే మొదలయ్యాయి టెలికాం ఆపరేటర్లు కదలడం లేదు. పాలు కూరగాయలూ భారీగా తుఫాను పీడిత ప్రాంతాల్లో డంప్ చేసాం రెవిన్యూ సిబ్బందిలో కదలిక లేదు. మరి ఇవ్వన్నీ ఎవరు చేసినట్లు? చంద్రబాబే వేల అవతారాలెత్తి తానే సర్వాంతర్యామి యై చకచకా పనులు చక్కబెట్టాడా? ఇలా చీవాట్ల పర్వం వల్ల పనిచేయడం కన్నా నాయకుని మెప్పు పొందేందుకు తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఎవరైనా ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఏర్పడుతుందని మానసిక శాస్త్రం కూడా చెపుతోంది.
గతంలో కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరించేవారు. జన్మభూమి లాంటి కార్యక్రమాల్లో పలుమార్లు తన యంత్రాంగాన్ని తానే వెధవలుగా చిత్రించేవారు. చివరకు ఏం జరిగింది.? ఒకరకంగా తన యంత్రాంగాన్ని తానే కించపరచడం వల్ల ప్రభుత్వం చాతకానిదన్న అభిప్రాయాన్ని ఆనాడు ముఖ్యమంత్రే స్వయంగా కల్పించారు. పాలనా యంత్రాంగాన్ని పనిచేయించాల్సిన భాద్యత కూడా రాజకీయ నాయకులదే వాళ్ళను పనిదొంగలుగా చిత్రీకరిస్తే పలితం వుండదు.
పనిదొంగలను ఏరిపారేసి పనిచేసే ప్రభుత్వాన్ని నడిపిస్తేనే ప్రజలు ఆహ్వానిస్తారు. ఇప్పటికైనా చంద్రబాబు తన మైండ్ సెట్ మార్చుకోకపోతే నష్టపోయేది తాము కాదు. ఆయనే అంటున్నారు ఉద్యోగులు.
(ప్రొఫెసర్.కె.నాగేశ్వర్)
0 comments:
Post a Comment